హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే నిత్యావసర సరుకుల విధానాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 90.46 లక్షల ఆహార భద్రతా కార్డుదారులకు బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఇక మీదట బియ్యానికి తోడు అదనంగా మరికొన్ని సరుకులను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో విడుదల కానున్నాయి. అదే విధంగా… ఆహారభద్రతా కార్డుపై అందించే బియ్యం కోటాను కూడా ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. ప్రస్తుతం లబ్దిదారులకు ప్రతి నెలా 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఇకపై 5కిలోలు అదనంగా కలిపి మొత్తం 15 కిలోల బియ్యాన్ని అందించనున్నారు.
ఇప్పటి వరకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తం 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే మే నెలలో కేంద్ర పథకం కింద ఇవ్వాల్సిన 5 కిలోల ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వలేదు. ఈ విషయంలో నెలకొన్న సందిగ్దతకు తెరదించుతూ మే నెల కోటాను ఆగస్టు నెల బియ్యంతో కలిపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో ప్రతి లబ్దిదారుడికి 10 కిలోల ఉచిత బియ్యానికి బదులు 15 కిలోలను అందించనున్నారు. ఇంట్లో అయిదుగురు కుటుంబ సభ్యులు ఆ కార్డుపై మొత్తం 75 కిలోల బియ్యం అందనున్నాయి. ఆగస్టు 4 తేదీ నుంచి 15 కిలోల బియ్యం పంపిణీ కానున్నాయి.