హైదరాబాద్, ఆంధ్రప్రభ : గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికితే.. ప్రజల పక్షాన ఆలోచించాల్సిన పాలకులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నియంతలా ప్రవర్తిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థుల పక్షాన ప్రజాస్వామిక పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టులు చేయడం దుర్మార్గమని గురువారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, విద్యావేత్త రియాజ్‌ను మప్టీ పోలీసులు తన కోచింగ్ సెంటర్‌లో అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదన్నారు.
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు విద్యార్థి సంఘం నాయకులను కూడా అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదన్నారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేయాలని, గ్రూప్- అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్దమవుతుందని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం నిరుద్యోగుల అర్తనాదాలను వినకుండా.. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ నీరోను తలపించే విధంగా పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్రి పరీక్ష పెడుతున్నారని ఆయన విమర్శించారు. గ్రూప్- 2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.