Monday, November 25, 2024

ప్ర‌జ‌లు మెచ్చే తీరుగా సర్కారు వైద్యం…

హైదరాబాద్‌,(ప్రభ న్యూస్‌): నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు. ఇది ఏడేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి. సర్కారు దవాఖానాల్లోనే సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వచ్చాక రాష్ట్రంలో ఈ పరిస్థితి మారింది. ఒకప్పుడు సర్కారు దవాఖానాల్లో ఇన్‌పేషెంట్‌గా చేరితే బెడ్లు దొరకని పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ఏడేళ్లలో సర్కారు దవాఖానాల్లో బెడ్లు మూడింతలు పెరిగాయి. సాధారణ జ్వరం మొదలు గుండె మార్పిడి చికిత్సల వరకు… అత్యాధునిక సౌకర్యాలతో బెడ్లు సిద్ధమయ్యాయి. కరోనా మొదటివేవ్‌ విపత్కర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా బెడ్లు దొరక్క చాలా మంది రోగులు ప్రాణాలు విడిచారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రెండో వేవ్‌ సమయానికి ఆక్సిజన్‌, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ బెడ్లను పెద్ద సంఖ్యలో సమకూర్చింది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్రం మొత్తం మీద కేవలం 17130 పడకలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉండేవి. అయితే ఈ ఏడేళ్ల కాలంలో దాదాపు మూడు రెట్లు పెరిగి 51వేల పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో కేవలం 100 వెంటిలేటర్‌ బెడ్లే ఉండగా… ఇప్పుడు 2వేలకు పైగా అందుబాటులోకి వచ్చాయి.

కరోనాతోపాటు ఇతర అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 20 ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఐసీయూలో 10 పడకలచొప్పున… 25 జిల్లా, ఏరియా దవాఖానాల్లో ఐసీయూ వార్డులను ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యహరించి పెద్ద ఎత్తున ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లను అందుబాటులోకి తీసుకురావడంతో కరోనా విపత్కర కాలంలోనూ ప్రజల ప్రాణాలను కాపాడగలిగామని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement