నర్సంపేట,(ప్రభ న్యూస్): ప్రజల ఆశీర్వాద బలమే ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరుకు కారణమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీని రూరల్ ప్రాంతమైన నర్సంపేటకు కేటాయిస్తూ జీవో నెంబర్ 83ను విడుదల చేసి నర్సంపేటపై తనకున్న ప్రేమను ముఖ్యమంత్రి కేసీఆర్ చాటుకున్నారన్నారు. విద్య వ్యవస్థకు పెట్టింది పేరుగా నర్సంపేట ఉందని, ఇప్పుడు హెల్త్ హబ్ గా సైతం నర్సంపేట మారుతుందని అందుకు నిదర్శనమే డి హబ్, క్రిటికల్ కేర్ యూనిట్, జిల్లా ఆసుపత్రి, మెడికల్ కాలేజీ అని అన్నారు. ప్రాంత అభివృద్ధి పై కనీస పట్టింపు, అవగాహన ప్రతిపక్షాల నాయకులకు లేకపోవడం విడ్డూరం అని, మంచి జరిగినపుడు రాజకీయాలు పక్కన పెట్టీ స్పందించాలని హితవు పలికారు.
మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి నిర్మాణం స్థల దాత దొడ్డ మోహన్ రావు కృషి ఫలితమని ధన్యవాదాలు తెలిపారు. క్రిటికల్ కేర్ యూనిట్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసి, నిర్మాణంలో ఉన్న 250పడకల ఆసుపత్రిని 450పడకల భోధన ఆసుపత్రిగా మార్పు చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. నర్సింగ్ కళాశాల మెడికల్ కాలేజీలో అంతర్భాగమేనన్నారు. నెలరోజుల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం నర్సంపేటను సందర్శనకు వస్తారని తెలిపారు. కళాశాల శాశ్వత నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా సేకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మిఠాయిలు పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట నారాయణ గౌడ్, ఆకుల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, గుంటి కిషన్, ఎంపిపి రమేష్, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు.