Saturday, November 23, 2024

లే అవుట్లకు వీలుగా ప్ర‌భుత్వం భూములు.. రియ‌ల్ బిజినెస్‌కు 30 వేల ఎకరాలు రెడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సర్కారీ రియల్‌ రంగానికి వీలుగా ప్రభుత్వ భూముల లెక్క తేలుతోంది. 30వేలకుపైగా ఎకరాల ప్రభుత్వ భూముల్లో రియల్‌ వ్యాపారాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల వివరాలను గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్లు పూర్తి వివరాలతో కూడిన నివేదికను సర్కార్‌కు అందజేశారు. అసైన్డ్‌ లబ్దిదారుల వివరాలు, ప్రస్తుతం ఎవరు అనుభవిస్తున్నారు. ఏ పంట సాగు చేస్తున్నారు… సాగులో లేకపోతే ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను ఈ నివేదికలో సమగ్రంగా పొందుపర్చారు. ఆయా భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరించిన వివరాలు, మున్సిపాలిటీలకు ఈ భూములు ఉన్న దూరం, వీటికి దగ్గర్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిశ్రమలు, జాతీయ రహదారులు, ఇతర రహదారుల వంటి సంపూర్ణ వివరాలను ఇందులో పొందుపర్చి ప్రభుత్వానికి అందజేశారు.

రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలంలో వచ్చిన స్పందన చూసిన తర్వాత ప్రభుత్వం రియల్‌ రంగం వైపుగా యోచిస్తోంది. రూ. 399కోట్లు అంచనా వేయగా, రూ. 567కోట్ల రాబడి సమకూరింది. ప్రస్తుతానికి జిల్లా, రెవెన్యూ కేంద్రాలతోపాటు, మున్సిపాలిటీల పరిధిలో లే అవుట్ల అభివృద్ధికి పరిశీలిస్తోంది. ప్రభుత్వమే రియల్‌ వ్యాపారం చేసి ఇండ్లులేని పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్లాట్లను అందించాలని భావిస్తోంది. తద్వారా అనధికారిక లే అవుట్లకు చెక్‌ పెట్టి, ప్రజలకు ఎటువంటి మోపం జరగకుండా ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో సొంతగా లే అవుట్ల అభివృద్ధికి కార్యాచరణ చేస్తోంది. విలువైన ప్రభుత్వ భూముల వేలంతోపాటు, క్రమబద్దీకరణల ద్వారా భారీ ఆదాయానికి రంగం సిద్దమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలనుంచి సేకరించిన సమాచారం మేరకు 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి వేలానికి సిద్దంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది.

వీటిద్వారా రూ. 12 వేల కోట్లకుపైగా ఆదాయం సాదించవచ్చని అంచనా వేసింది. ఇందుకు జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు, మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీలు, మున్సిపాలిటీలలోని స్థలాలను గుర్తించింది. తొలుత ప్రభుత్వ భూముల విక్రయాలతో ఖజానాను నింపుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అనువైన ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. భూముల క్రమబద్దీకరణ, వేలం ద్వారా రూ. 12వేల కోట్లు సాధించవచ్చని ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేసుకున్న పేదలకు క్రమబద్దీకరణ చేయాలని సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 125 గజాల వరకు ఉచితంగానే క్రమబద్దీకరణ చేస్త్తున్నప్పటికీ అంతకు మించిన భూములు, స్థలాలకు మార్కెట్‌ ధరను నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement