హైదరాబాద్, ఆంధ్రప్రభ : గిరిజనులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి మరో పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ‘ సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం ‘ తీసుకొచ్చారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే 300 మంది పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారని, మరి కొంత మంది పారిశ్రామిక వేత్తలుగా తయారయ్యేందుకు డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు. శనివారం డీఎస్‌ఎస్ భవన్‌లో 13 మంది ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 7.81 కోట్ల వడ్డిలేని రుణాలకు సంబంధించిన చెక్‌లను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ వల్ల ఎస్టీ పారిశ్రామిక వేత్తలు ఇబ్బందులు పడ్డారని, వారికి మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 81 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారని, ఇప్పటికే 31 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. ఎస్టీ నిరుద్యోగ యువతకు 38 సెంటర్ల ద్వారా 10 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.