సంగారెడ్డి, సెప్టెంబర్ 16 (ప్రభ న్యూస్) : మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ అన్నారు. మైనార్టీలు సురక్షితంగా ఉన్నారంటే అది తెలంగాణలోనేనని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభద్రత భావంతో ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా మొదట కంది మండలం చిమ్మాపూర్ చెరువులో చేప పిల్లలను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా వదిలారు. సంగారెడ్డి- మల్కాపూర్ వద్దగల గోకుల్ ఫంక్షన్ హాల్ లో పెంచిన వికలాంగుల పింఛనుకు సంబంధించి వికలాంగులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.
మైనార్టీలకు ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి పట్టణంలో ముస్లిం మైనార్టీలకు కబరస్థాన్ కోసం కేటాయించిన భూమికి సంబంధించిన ఉత్తర్వులను ముస్లిం పెద్దలకు అందజేసి, క్రిస్టియన్ మైనార్టీలకు కేటాయించిన భూ కేటాయింపు ప్రొసీడింగ్స్ ను వారికి అందజేసారు. జీఓ 58 ఫేజ్ – 2లో హౌస్ సైట్స్ పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను, నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి హరీష్ రావుప్రారంభించారు. మధ్యాహ్నం కలెక్టరేట్ ఆడిటోరియంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రెగ్యులరైజేషన్ నియామకపు ఉత్తర్వులను, కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ఉత్తర్వులను సంబంధితులకు అందజేశారు.
అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల యూనియన్ కు కేటాయించిన భూమి పత్రాలను అందజేసి, ఎస్.ఎస్.జీ -2023 అవార్డులను ఆయా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, కే సత్యనారాయణ, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ నగేష్, తదితరులు పాల్గొన్నారు.