Thursday, November 21, 2024

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య, ఆమె జీవిత సహచరుడు రాకృష్ణారెడ్డిలపై తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఏఐకెఎంఎస్, ఇప్టు, పివై ఎల్, పిడిఎస్ యుల ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా ఏ ఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ… ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ జీవిత విషయాలను, జ్ఞాపకాలను అతని భార్య, ఇతర సహచరులు రాసిన అనేక విషయాలను, పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పుస్తక రూపంలో ముద్రించారని తెలిపారు. దీనిని నేరంగా పరిగణిస్తూ సంధ్య, రామకృష్ణరెడ్డి ల పై కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన భర్తను, కొడుకును సమాజ మార్పుకోసం పేదల బ్రతుకుల్లో వెలుగునింపడం కోసం అంకితమిచ్చిన ఓ మహిళ తనభాదను, భావాలను ప్రజలతో పంచుకోవడం, నేరమా, అందుకు సహకరించడం నేరమా అని ప్రశ్నించారు.

ప్రచురితమైన విషయాన్ని పుస్తక రూపంలో తేవడం ఎలానేరంవుతుందన్నారు. ప్రజల అభిమానం, ఆదరణ పొందిన వారి జీవితం గురించి తెలుసుకోవడం నేరంకాదని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రగతిశీల మహిళ సంఘ నాయకురాలిగా పరిచయమైన సంధ్య ఎలా మావోయిస్టు అవుతుందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తుందని విమర్శించారు. ప్రజలకోసం పనిచేసే ఓ తెలంగాణ ఉద్యమకారిణిపై కేసులు పెట్టడం ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. తెలంగాణ పోరాటంలో నక్సలైట్ల ఎజెండాయే నాఏజెండా అని నమ్మబలికిన కేసీఆర్ అధికారం వచ్చిన తరువాత గత ప్రభుత్వాలకంటే నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ అక్రమ కేసును వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆగ్రహం చూడవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు సనప పొమ్మయ్య మండల కార్యదర్శి భానోత్ నర్సింహ, ఇఫ్టూ నాయకులు మాధంశెట్టి నాగేశ్వరావు, పివైఎల్ రాష్ట్ర నాయకులు తుడుం వీరభద్రం, పిడిఎస్ యు రాష్ట్ర నాయకులు బోనగిరి మధు, దేవేందర్, మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి భిక్షం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement