Friday, November 22, 2024

అతిథి అధ్యాప‌కుల గోస‌.. ఇంకా రెన్యూవల్‌ చేయని విద్యాశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేసే అతిథి అధ్యాపకుల(గెస్ట్‌ లెక్చరర్లు) బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇంటర్‌ తరగతులు ప్రారంభమై నేటికీ నెల 15 రోజులు కావొస్తోంది. అయినా కూడా ఇప్పటి వరకూ గెస్ట్‌ లెక్చరర్లను ఇంకా విద్యాశాఖ విధుల్లోకి తీసుకోలేదు. వారిని రెన్యూవల్‌ చేయకుండానే నాన్చుతోంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్చి, ఏప్రిల్‌, మే నెలల వేతనాలు సైతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒకవైపు వేతనాలు రాక, మరోవైపు ఉద్యోగాలు రెన్యూవల్‌ కాక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 1654 మంది అతిథి అధ్యాపకుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. వీరి ఉద్యోగాలను రెన్యూవల్‌ చేయడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

గెస్ట్‌ లెక్చరర్ల రెన్యూవల్‌కు సంబంధించిన దస్త్రం ఇంటర్‌ కమిషనర్‌ కార్యాలయం నుండి ఉన్నత విద్యాశాఖకు కొన్ని రోజుల క్రితమే వెళ్లింది. అక్కడి నుంచి ఆ ఫైల్‌ను ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు పంపారు. అయితే ఆ దస్త్రంలో అతిథి అధ్యాపకుల విధులకు సంబంధించి జిల్లాల వారీగా, కళాశాలల వారీగా పూర్తి సమాచారం లేదని ఆర్థిక శాఖ తెలిపింది. అంతేకాకుండా కాలేజీల వారీగా 1654 సాంక్షన్డ్‌ పోస్టులకు ప్రతిపాదనలు పంపాలని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ని ఆర్థిక శాఖ కోరింది. ఆమేరకు పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనలను పంపించాలని గత జూన్‌ 27న ఇంటర్‌ కమిషనరేట్‌కు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మెమో నెంబర్‌ 637ను జారీ చేశారు. పూర్తి సమాచారంతో కూడిన ఫైల్‌ను హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయం నుంచి ఇంత వరకు ఫైలు వెళ్లలేదని అధ్యాపకులు చెప్తున్నారు.

ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి అతిథి అధ్యాపకులు కృషి చేస్తున్నారు. మొదట్లో వీరి వేతనం 10 నెలలుగా ఉండేది. ఆ తర్వాత ఆరు నెలల నుంచి మూడు..నాలుగు నెలలకు తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో నాలుగు నుంచి ఆరు నెలల వేతనం పొంది కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభం నుండే తమను రెన్యూవల్‌ చేయాలని రాష్ట్ర అతిధఙ అధ్యాపకుల జేఏసీ ప్రధాన కార్యదర్శి కె.దేవేందర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. తమకు అందరిలాగా 12 నెలల వేతనాన్ని అందించాలని పేర్కొన్నారు. గురుకులాలలో పనిచేసే అతిథి అధ్యాపకుల తరహాలోనే ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో పనిచేసే అతిధి అధ్యాపకులకూ స్థిర వేతనాన్ని అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement