హైదరాబాద్ – ఎన్నికల వేళ కమలం పార్టీకి తెలంగాణలో బిగ్ షాక్ తగలనుంది.. ఫైర్ బ్రాండ్, బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు.. ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కాషాయం కండువా తీసేస్తారని గట్టిగానే టాక్ నడుస్తోంది. పక్కాగా పార్టీ మారుతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఖండించిన దాఖలాల్లేవ్. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా రియాక్ట్ కాలేదు. పైగా.. బీజేపీని తిట్టినట్లే, వ్యతిరేకించినట్లే పరోక్షంగా ట్వీట్లు చేస్తుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. పార్టీ కార్యక్రమాలకు సైతం అధినాయకులు పిలవడం లేదు.. దీంతో కమలం వీడి హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు.
బిజెపి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న రాములమ్మను ఇప్పటికే రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడినట్లు సమాచారం. అలాగే ఢిల్లీలోని ఎఐసిసి పెద్ద నేతలతో కూడా ఆమె మాట్లాడారు.. భవిష్యత్ రాజకీయ వ్యవహారలలో కీలకభూమికి నిర్వహించేలా అవకాశాలిస్తామని హస్తం పార్టీ భరోసా ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు పార్టీ మారే విషయంలో డైలమాలో ఉన్న రాములమ్మ ఇక పార్టీ మార్చేయాలని నిర్ణయించుకున్నారట.. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం తీసుకోవచ్చని అంటున్నారు.