హైదరాబాద్, ఆంధ్రప్రభ: పంద్రాగస్టు రోజున ఉద్యోగులకు ఆర్టీసీ తీపి కబురు అందజేసింది. సెప్టెంబర్ నెల జీతంతోపాటు మరో డీఏను అందించనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బస్ భవన్ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్‌తో కలిసి బాజిరెడ్డి గోవర్థన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో బీడబ్ల్యూఎస్ పథకం ద్వారా త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. రానున్న రోజుల్లో 300 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కమర్షియల్ రెవెన్యూ కోసం అతి త్వరలోనే సొంత బ్రాండ్‌తో ఆర్టీసీ జివా వాటర్ బాటిళ్లను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఉద్యోగుల 1000 కోట్ల బకాయిలను అతిత్వరలోనే చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
1932 నాటి డెక్కన్ క్విన్ అల్బినియస్ బస్సు చరిత్రను సీఎంకు వివరిస్తానని పేర్కొన్నాీరు. హైదరాబాద్ నగరంలో ప్రధాన రోడ్డు మార్గాలలో నిజాకాలం నాటి బస్సును ప్రజల సందర్శనార్థం ప్రదర్శనలో ఉంచుతామని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర సిబ్బంది ఎంతో కష్టపడి రూ.20 కోట్ల ఆదాయానికి కృషి చేశారన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ ఉత్సవాల్లో భాగంగా నిజాం రోడ్డు రవాణా విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు టీఎల్ నరసింహ(97), ఎం.సత్తయ్య(92)లకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సంస్థ అధికారులు రవీందర్, వినోద్, యుగేందర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.