తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంఓనే ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో (ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు) చదువుకునే స్టూడెంట్స్ కోసం అల్పాహార పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం’ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఏఎస్ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఈ మధ్యనే పంపించారు. తమిళనాడు వెళ్లిన అధికారుల బృందం.. అక్కడ పథకం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే విద్యార్థులకు అల్పాహారం పథకం అమలు చేస్తున్నారనే విషయాన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి ఈ బృందం తీసుకెళ్లింది. అయితే విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించిన కేసీఆర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకే కాకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్‌ఫాస్ట్‌ను అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా దాదాపు ₹400 కోట్ల అదనపు భారం పడనున్నది.