హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ప్రతీ వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. రెండు రోజుల పాటు సాగే ఈ టూర్ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలం లోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలనుసందర్శించవచ్చు.
ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్ ఆర్టీసీ ఖరారు చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. హైదరాబాద్ నుంచి ప్రతీ రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది, వీకెండ్‌లలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటున్న కారణంగా ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని టీఎస్ ఆర్టీసీ అందిస్తోందనీ, ఈ ప్యాకేజీని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలనీ, మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ నెంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జన్నార్ సూచించారు.