Tuesday, November 19, 2024

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. దీపావళికి 3 డిఎలు, పండుగ అడ్వాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా 3 డిఎలతో పాటు పండుగ అడ్వాన్స్‌ను కూడా ప్రకటించింది. ఈమేరకు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధర్‌, ఎండి విసి సజ్జన్నార్‌ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 5 డిఎలలో ప్రస్తుతం 3 డిఎలను చెల్లించనున్నట్లు, వాటి కోసం రూ.15 కోట్లతో పాటు డిఎ బకాయిల కోసం మరో రూ.20 కోట్లు కేటాయించడం జరుగుతోందన్నారు. అలాగే, ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్‌లను కూడా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.

సకల జనుల సమ్మె సమయంలో 8053 మంది ఉద్యోగులకు జీతాలు రాలేదనీ, వీరి జీతాల చెల్లింపు కోసం రూ.25 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పదవీ విరమణ చసిన సిబ్బంది ఈఎల్‌లు చెల్లించేందుకు మరో రూ.20 కోట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణలో ఆర్టీసీ అభ్యున్నతి దిశగా పయనిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలలో రోడ్డు రవాణా సంస్థల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందంటూ అక్కడి ప్రభుత్వాలు సంస్థను ఆదుకోవడం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కుతోందని స్పష్టం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే అప్పట్లో కేవలం రూ.9 కోట్లుగా ఉన్న ఆదాయం ప్రస్తుతం సంస్థకు ఓఆర్‌ ద్వారా సరాసరి రూ.14 కోట్ల వరకూ వస్తుందన్నారు. తాము బాధ్యతలు చేపట్టిన తరువాత సంవత్సర కాలంలో సంస్థ పనితీరు ఎంతో బాగుపడిందనీ, రానున్న కాలంలో మరింత అభ్యున్నతి దిశగా పయనిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

1150 కొత్త బస్సుల కొనుగోలు : ఎండి సజ్జన్నార్‌
ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా 1150 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ఎండి విసి సజ్జన్నార్‌ తెలిపారు. 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులను కొనుగోలు చేస్తున్నామనీ, అలాగే, 360 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం టెండర్‌ను కూడా నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ డిసెంబర్‌ నాటికి బస్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎల్రక్టిక్‌ బస్సులు ఇంటర్‌ సిటీ కనెక్టవిటీ నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ తదితర అన్ని జిల్లాలకు నడుపనున్నట్లు వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా సజ్జన్నార్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement