Friday, November 22, 2024

గోల్కొండలో అషాడ‌మాసం బోనాలు ..ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన అమాత్యులు

హైద‌రాబాద్ – గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం బోనాలు గురువారం ప్రారంభమయ్యాయి. బోనాలలో పోతురాజులు, భాజా భజంత్రీలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల తొలి రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం లంగ‌ర్ హౌస్ నుంచి ర‌థం, తొట్టెల ఊరేగింపు ప్రారంభ‌మై గోల్కొండ కోట‌లోని జ‌గ‌దాంబ ఆల‌యం వ‌ర‌కు కొన‌సాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆల‌య క‌మిటీ స‌భ్యులు, ప్రధానార్చకుల ఇంట్లో ఘ‌నంగా పూజ‌లు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ పండుగ‌ల్లో ఒకటైన బోనాల పండుగ‌ను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ‌గా ప్రకటించిందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15కోట్లను కేటాయించిందన్నారు. కాగా తొలిరోజు బోనాలు స‌మ‌ర్పించేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement