Tuesday, November 19, 2024

Golden Offer – అక్బ‌రుద్దీన్ కు రేవంత్ బంప‌ర్ ఆఫ‌ర్ ….

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణగుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి.. దగ్గరుండి నామినేషన్ వేయిస్తానని.. గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు.

కాగా,అంతకు ముందు ఎంఐఎం అక్బ‌రుద్దీన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతానికి మెట్రో రైలును విస్తరించాలని డిమాండ్ చేశారు. తమతో తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న కేటీఆర్ తెస్తున్నాం.. తెస్తున్నాం అంటూ కాలయాపన చేశారు తప్పా ఏనాడూ ముందడుగు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్రో హైదరాబాద్‌కు మెట్రో కావాలని తానే డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. దీని కోసం ఆనాడు ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. చివరకు పోరాడి తీసుకొచ్చామని.. కానీ, నా ప్రాంతంలోనే ఇప్పుడు మెట్రో సేవలు లేవు అని.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు అని అన్నారు.

- Advertisement -

దీనిపై రేవంత్ మాట్లాడుతూ, పాతబస్తీ మెట్రో నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మెట్రో నిర్మాణం కోసం ఎల్ అండ్ టీతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థల భూముల ధరలను పెంచేందుకే ఆ మార్గంలో మెట్రో రైలు ప్రతిపాదించారన్నారు.

ఇప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మంచి రోడ్లు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం మెట్రో అవసరం లేని మార్గాల్లో మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మిస్తుందన్నారు. పాతబస్తీకి మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం చేపడతామన్నారు.

ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ

రెండో దశ మెట్రోకు నిధులు కోరితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పాతబస్తీకి, ఎయిర్ పోర్టుకు మెట్రోను కచ్చితంగా నిర్మిస్తామన్నారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి భూసేకరణను ఇప్పటికే ప్రారంభించామన్నారు. పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ అని సీఎం వ్యాఖ్యానించారు. రెండో విడత మెట్రో విస్తరణపై గత ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందని ఆరోపించారు.

హైదరాబాద్‌కు మెట్రో రైలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తాము వచ్చాక పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు విషయమై రీడిజైన్ చేశామన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించానన్నారు. బీఆర్ఎస్ మోసం చేయడం వల్లే పాతబస్తీ మెట్రో కల నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలా హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తాం, లండన్ చేస్తామని తాము చెప్పమని… కానీ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో అక్బ‌రుద్దీన్ ను కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా కొడంగ‌ల్ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు

ఎంఐఎంలో ఆనందంగా ఉన్నా…
ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీలో నేను సంతోషంగానే ఉన్నానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని రేవంత్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు

పెద్దన్నలా ఉండాలని మోదీని కోరా

రాష్ట్రాల పట్ల పెద్దన్నలా వ్యవహరించాలని తాను ప్రధాని మోదీని పలుమార్లు కోరానన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని పెద్దన్న అంటే తప్పేమిటని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని మోదీని కోరినట్లు చెప్పారు. కానీ కేవలం బీహార్, గుజరాత్ రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement