భద్రాచలం, (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. ప్రతి గంటకు అరడుగు పైగా పెరుగుతూ గోదారమ్మ ఉగ్రరూపం దాలుస్తోంది. ఉదయం 6 గంటలకు 46.2 అడుగులు వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 49.6 అడుగులకు చేరుకుంది. 3 గంటల సమయానికి 50.50 అడుగులతో ఉధృతంగా కొనసాగుతోంది.
ఇక.. ఇదే ఉధృతి కొనసాగితే సాయంత్రం 6 గంటల వరకు 52 అడుగుల మార్కును చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులను, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కోరారు. పెరుగుతున్న గోదావరి ప్రవాహం దృష్ట్యా ఎటువంటి ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా అధికారులు ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరవాస కేంద్రాలకు తరలిపోవాల్సిందిగా జిల్లా యంత్రాంగం కోరుతోంది.