భద్రాచలం, ప్రభన్యూస్: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. మూడవ ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ఉదయం గం.9.00లకు 54.4 అడుగులున్న గోదావరి నీటిమట్టం సాయంత్రం గం.6.00ల సమయంలో 55.6 అడుగులకు చేరుకుంది. 15లక్షల 65వేల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. ఇదిలా ఉండగా సెంట్రల్ వాటర్ కమిషన్ వారు శనివారం రాత్రి గం.9.00ల సమయానికి 56 అడుగులకు పైగా గోదావరి నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో గోదావరి పెరుగుతోంది. భద్రాచలం డివిజన్‌లో శుక్రవారం, శనివారం స్వల్పంగానే వర్షం కురిసింది. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో పట్టణంలోని కొత్తకాలనీ, సుభాష్ నగర్ కాలనీ వంటి ప్రాంతాలు జలమయం అయ్యాయి. 430కి పైగా కుటుంబాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. భద్రాచలం నుంచి ఆంధ్రాకు వెళ్ళే కూనవరం రోడ్డులో వరద నీరు రహదారిపైకి చేరుకుంది. మరోవైపు దుమ్ముగూడెం మార్గంలో కూడా అనేక చోట్ల రహదారిపైకి వరద నీరు రవాణాకు అంతరాయం కలిగించింది.
భద్రాచలం దుస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: సీఎల్పీ నేత భట్టి
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం పరిసి ్థతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య అసెంబ్లిdలో ఎన్నిసార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. పాల్వంచ-భద్రాచలం మధ్యలో ధ్వంసమైన నాగారం చెక్ డ్యాంను ఆయన పరిశీలించారు. కరకట్ట, విస్తా కాంప్లెక్స్, రామాలయం ప్రాంతాలలో ఆయన తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గజ ఈతగాళ్ళను సైతం పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దుమ్ముగూడెం మండలంలో పర్యటించి నారాయణరావుపేట గ్రామంలో ఎమ్మెల్యే వీరయ్యతో కలిసి నాట్లు వేశారు. సహాయక కేంద్రాల్లో ఉన్న ముంపు ప్రాంత వాసులకు కలిసి భరోసా కల్పించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రజల కష్టాలు తీరతాయని ఆయన తెలిపారు.
ఏరియల్ సర్వే నిర్వహించిన మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతిని మరోసారి పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ క్రమంలో ఆయన వరద పరిస్థితిని తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే సైతం చేపట్టారు. అనంతరం ఐటీడీఏ అతిధి గృహంలో అధికారులతో, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, పైలెట్లతో చర్చించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు సహకారం అందించాలని సూచించారు.
ఆహారం అందక రోడ్డుపైకి ఎక్కిన బాధితులు
భద్రాచలం పట్టణంలోని నన్నపునేని పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రంలోని ముంపు బాధితులకు మధ్యాహ్నం గం.3.00లు అవుతున్నప్పటికీ ఆహారం అందకపోవడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కష్ట సమయాల్లో ఆదుకోవాల్సిన అధికారులు తమకు అల్పాహారం, భోజనం సమయానికి అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం పార్టీ నాయకులు సైతం విమర్శలు చేశారు.