జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (GHIAL) వరుసగా రెండోసారి ACI వరల్డ్ (ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) వారి “వాయిస్ ఆఫ్ కస్టమర్” గుర్తింపు లభించింది. 2021లో కోవిడ్ సమయంలో ప్రయాణీకుల అవసరాలను అర్థం చేసుకుని, దానికి తగిన చర్యలను తీసుకుంటూ చేసిన నిరంతర కృషికి ఈ గుర్తింపు లభించింది. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో పోషించిన చురుకైన పాత్రకు గాను హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ గుర్తింపు దక్కింది. ఈసందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పణికర్ వరుసగా రెండోసారి ఈ గుర్తింపును పొందడం తమకు దక్కిన గౌరవమన్నారు.
తమ భాగస్వాములందరి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికుల విశ్వాసాన్ని పొందడానికి ఉమ్మడిగా కృషి చేయడం చాలా అవసరమన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తాము విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనల అమలుకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ప్రయాణికుల భద్రత కోసం వీడియో అనలిటిక్స్ వినియోగం, అదనపు ఆర్టీ-పీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు వంటి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. విమానాశ్రయ ఆపరేటర్‌గా తమకు ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమన్నారు. దానికోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు జీఎంఆర్ నిర్వహిస్తున్న మరో విమానాశ్రయం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికీ ఈ గుర్తింపు లభించిందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..