హైదరాబాద్, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లలో పురుషులు, స్త్రీలకు మాత్రమే ఉద్యోగాల కోసం అవకాశాలను కల్పించారని, మాకూ అవకాశం ఇవ్వాలంటూ ట్రాన్స్‌జండర్స్ డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డిని కలిసి విన్నవించారు. డీజీపీ కార్యాలయంలో బుధవారం మహేందర్‌రెడ్డిని కలిసిన ట్రాన్స్‌జండర్స్ ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు. కానిస్టేబుళ్ళు, ఎస్‌ఐల పోస్టులతో పాటు ఐటీ తదితర విభాగాలలో పురుషులు, స్త్రీలకు మాత్రమే అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్స్ పోలీసు ఉద్యోగాలు సాధించగలరని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా డీజీపీకి గుర్తు చేశారు. తమకూ ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందేనని కోరారు. ఉద్యోగావకాశాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇదిలా ఉండగా, పోలీసు ఉద్యోగాల దరఖాస్తుల కోసం చివరి గడువు ఈ నెల 20 తేదీతో ముగియనుండటంతో ట్రాన్స్‌జండర్స్ డిమాండ్ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.