న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని బీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు దివికొండ దామోదర్‌రావు, బడుగుల లింగయ్య యాదవ్ కేంద్ర పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి తన్మయ్ కుమార్‌తో బుధవారం భేటీ అయ్యారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ మేరకు ఎంపీలు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండపలం వీర్లపాలెంలో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణమవుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు 64 శాతం పూర్తయ్యాయని తన్మయ్ కుమార్‌కు వివరించారు. రూ. 29,965.48 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే 20వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 64.20 శాతం పనులు పూర్తి చేశామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మిగతా అన్ని రకాల పనులు త్వరితగతిన జరుగుతున్నాయని, అందుకు అవసరమైన పర్యావరణ అనుమతులివ్వాలని కోరారు. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి స్థానికులు సంపూర్ణ మద్దతు తెలిపారని ఎంపీల బృందం అదనపు కార్యదర్శికి వివరించింది. ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రాన్రికి విద్యుత్ లోటు- ఉండదని వివరించారు. మొదటి రెండు యూనిట్లను ఆగస్టు 2023 నాటికి బ్యాలెన్స్ యూనిట్లను మార్చి 2024 నాటికి పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని నామా పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు- నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని నామా నాగేశ్వరరావు ఆయనకు వివరించారు.