భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థులు మూడవ స్థానానికే పరిమితం అవుతారన్నారు.
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండని తెలిపారు. హామీలు అమలు కాకపోతే బీఆర్ఎస్ కు ఓటేయండి అన్నారు.
కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే బీఆర్ఎస్ గెలవాల్సిందే అన్నారు. ఇచ్చిన హామీల అమలుపై మంత్రులు బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో లీకేజీలు ఇస్తూ పాలన చేస్తున్నారన్నారు. కేసిఆర్ పర్యటన తర్వాతే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు కరీంనగర్ వరద కాలువకు నీటి విడుదల జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికాగానే కరెంటు, నీటి బిల్లులు పెంచుతారన్నారు.
బీజేపీ పాలనలో అన్ని వర్గాలు దగాపడ్డాయన్నారు. జాతీయ పార్టీలు గెలిస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఎప్పుడూ అధికారంలో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ గ్రూపు తగాదాలే పడగొడతాయని తెలిపారు. ఉద్యమం సమయంలోను బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లారని, పైరవీ కారులు, కాంట్రాక్టర్ లు పార్టీని విడిచిపోతున్నారన్నారు.
పార్టీని విడిచి పోయిన వారిని కాళ్ళు మొక్కినా తిరిగి చేర్చుకోమన్నారు. బీజేపీ నుండి నలుగురు ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. కార్యకర్త లకు తెలంగాణ భవన్ లో లీగల్ టీమ్, ముఖ్య నేతలు అందుబాటులో ఉంటారన్నారు. పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరను బీఆర్ఎస్ పార్టీ గమనిస్తుంది.. త్వరలోనే అవకాశం వస్తుంది గట్టిగా సమాధానం చెప్తామన్నారు.