హైదరాబాద్, (ప్రభ న్యూస్): హైదరాబాద్‌లో నాలా వ్యవస్థను మెరుగుపరిచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎట్టకేలకు నడుం బిగించింది. రెండేళ్లుగా నమోదైన భారీ వర్షపాతానికి నగరం మొత్తం నదిని తలపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో హైదరాబాద్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. మురుగు నీటి కాలువల (ఎస్‌డబ్ల్యూడీ) వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.858 కోట్ల మంజూరుతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు సిద్ధమైంది.
రెండేళ్ల క్రితం భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. నాలా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. దాంతో ఎస్ఎన్డీపీ ముంపు ప్రాంతాలు, నాలా వ్యవస్థపై అధ్యాయనం నిర్వహించి, నివేదికను తయారు చేసింది. పెద్ద సంఖ్యలో నాలాలు, ట్రంక్ మెయిన్లు, ఫీడర్ నాలాల వెంట అనేక ఆక్రమణలు జరిగినట్లు గుర్తించి నివేదికలను కార్పోరేషన్‌కు సమర్పించింది. ఈ నివేదిక నాలా వ్యవస్థ మెరుగు పరచటానికి రిటేనింగ్ వాల్స్, క్యాపింగ్ పనులను ప్రోగ్రాంలో చేపట్టాలని సూచించింది. జీహెచ్ఎంసీ ప్రత్యేక విభాగం అయిన ఎస్న్డీపీ, అక్టోబర్ 2020లో సంభవించిన ఆకస్మిక వరదల సమయంలో ముంపునకు గురైన మఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ మొదటి దశలో రూ.858 కోట్లతో కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
కానీ ప్రణాళిక అమలులో తీవ్ర జాప్యంతో తిరిగి 2021 వరదలతో మళ్లి నష్టం వాటిల్లింది. దాంతో అధికారులు రూ.110 కోట్లతో కొన్ని ముఖ్యమైన నాలా పనుల కోసం బిడ్లను ఆహ్వానించారు. మళ్లి జాప్యం జరగితే ఈ సారి నష్టం తీవ్రత అధికంగా ఉంటుంది. 2022లో వరద ముప్పు పెద్దదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.