నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలతో కలిగిన సమస్యలను స్వయంగా నగర శాసన సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. అంతేకాదు ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. నాగోల్ లోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వర్షాలతో ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్బంగా స్థానికులు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులను మేయర్ ఆదేశించారు.
గతేడాది వచ్చిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నగరంలోని నాలాలను విస్తరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని నగర మేయర్ తెలిపారు. నాలా అభివృద్ధి పనులను స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక పనులుగా విభజించి స్వల్ప కాలిక పనులను చేపట్టామని వివరించారు. స్థానికుల సమస్యలను అతి త్వరలోనే పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడతామన్నారు. మరో రెండు మూడు రోజులు నగరంలో వానలు కురిసే అవకాశం ఉన్నందున నగర వాసులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను మేయర్ ఆదేశించారు. వర్షాల్ల వల్ల ఏదైనా సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040 21111111 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని మేయర్ విజయ లక్ష్మి నగర వాసులకు సూచించారు.