హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఆంక్షలపై జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ వేసింది. నెల రోజుల క్రితమే నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇప్పటికిప్పుడు హైకోర్టు తీర్పును అమలు చేయటం సాధ్యపడదని రివ్యూ పిటిషన్ లో జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇటీవల ఇచ్చిన తీర్పులో ప్రధానంగా 4 అంశాలను సవరించాలని కోరింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని జీహెచ్ఎంసీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. హుస్సేన్‌సాగర్, జలాశయాల్లో నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని, ట్యాంక్ బండ్‌పై నిమజ్జనానికి అనుమతించాలని పేర్కొంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఇప్పటికే భారీ క్రేన్స్ ఏర్పాటు చేశామని, నగరంలో వేలాది గణనాథులున్నాయని తెలిపింది. ఈ సమయంలో కొత్తగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయటం అసాధ్యమని జీహెచ్ఎంసీ కోర్టు దృష్టికి తెచ్చింది. నిమజ్జనం పూర్తైన 24గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపింది.
మరోవైపు నిమజ్జనంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పోలీసులు గణేష్ మంటపాల నిర్వాహకులకు కొత్తగా ఆదేశాలిచ్చారు. నిమజ్జనంపై సూచనలు చేశారు. దీంతో హైకోర్టు సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఇది కూడా చదవండి: రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్: సీఎం కేసీఆర్ కీలక ఆదేశం