ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశంలో బీఆర్ ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బీఆర్ ఎస్ కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మేయర్ విజయలక్ష్మికి, కార్పొరేటర్లకు వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో పదిహేను నిమిషాలు సమావేశాన్ని వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సమావేశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేశారు. అనంతరం అజెండా అంశాలపై చర్చ ప్రారంభం అయిన వెంటనే బీఆర్ ఎస్ కార్పొరేటర్లు మళ్లీ ఆందోళనకు దిగారు. నగరంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, వాటిపై చర్చ జరగాలని ఎవరి సీట్లలో వారు కూర్చు వాలని మేయర్ విజయలక్ష్మి పలుమార్లు కోరినా ఫలితం లేకపోయింది. తమ పార్టీలో ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజాసమస్య చర్చించడానికి సమయం లేకుండా చేస్తున్నారని బీఆర్ ఎస్ కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి మండి పడ్డారు. సిటీలో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడం కోసమే కావాలని గొడవలు చేస్తున్నారని ఆమె అన్నారు.
ఉద్రిక్తతకు దారితీసిన వైనం
కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తత దారితీసింది. కార్పొరేటర్లు ఒకరిని ఒకరు విమర్శించుకోవడంతో గందరగోళం ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కౌన్సిల్‌ను కంట్రోల్ చేయలేక.. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే సభ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెళ్లిపోయారు. ఘర్షణ వాతావరణానికి నిరసనగా కౌన్సిల్ హాల్‌లోనే బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనలకు దిగారు. తమ పై దాడి చేసిన ఎంఐఎం కార్పొరేటర్లు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లకు మార్షల్స్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కలుషిత నీటిపై ఆందోళన
కలుషిత నీటిపై కౌన్సిల్‌లో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. తమ డివిజన్‌లో కూడా కలుషిత నీరు వస్తోందని మేయర్ విజయలక్ష్మి చెప్పారు. కౌన్సిల్‌కు జలమండలి ఎండీ హాజరుకాలేదు. దీంతో ఆ ఎండీపై కార్పొరేటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ నుంచే జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో మేయర్ ఫోన్‌లో మాట్లాడారు. జ్వరం కారణంగా తాను కౌన్సిల్ సమావేశానికి.. హాజరుకాలేకపోతున్నట్లు వాటర్ బోర్డ్ ఎండీ వివరణ ఇచ్చుకున్నారు. జలమండలి ఎండీని కౌన్సిల్ మీటింగ్‌కు రావాలని మేయర్ కోరారు. ఈ వ్యవహారంపై కలుగజేసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి.. కార్పొరేటర్లకు సారీ చెప్పారు. దీంతో కార్పొరేటర్లు కాస్త శాంతించారు..
నిరవధిక వాయిదా
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం ఏర్పడటంతో కౌన్సిల్ సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.