హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జీహెచ్ఎంసీ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వరద బాధితులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే వరద బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు గన్ పార్క్ నుంచి జీహెచ్ ఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, అనిల్ యాదవ్, విజయారెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షాలతో కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. విజయారెడ్డి, పలువురు కార్యకర్తలు జీహెచ్ఎంసీ కార్యాలయ మెయిన్ గేటు ఎక్కేందుకు యత్నించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించేందుకు పలువురు ముఖ్యనేతలను లోపలికి అనుమతించారు.
కమిషనర్ పేషీలో నేతల బైఠాయింపు
జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తీరుపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తాము వినతిపత్రం అందించేందుకు వెళ్లగా.. తీసుకునేందుకు ఆయన నిరాకరించారని ఆరోపించారు. దీంతో ఆయన పేషీ ముందు సీనియర్ నేతలు మల్లు రవి, వి.హనుమంతరావు (వీహెచ్), కోదండరెడ్డి, విజయారెడ్డి తదితరులు బైఠాయించి కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతె ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.