Friday, November 22, 2024

కిక్ కు… కిక్ – ఖ‌జ‌నా గ‌ల‌గ‌ల‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఖజానాకు కాసుల పంట పండుతోంది. ముగుస్తున్న ఆర్థిక ఏడాదిలో మద్యం విక్రయాలు ఖజానాను ఆదుకుంటున్నాయి. జోరుగా పెరుగుతున్న మద్యం, బీర్‌ విక్రయాలు నానాటికీ ఆదా యాన్ని పెంచుతున్నాయి. సొంత వనరుల రాబడిలో టాప్‌ గేర్‌లో దూసుకుపోతున్న తెలంగాణ మద్యం విక్రయాల్లో పొరుగు రాష్ట్రాలకు దిమ్మతిరిగే షాకిచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికంగా మద్యం విక్రయాలతో ఖజానాకు కాసులు కురిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న హెచ్‌పీఎఫ్‌ఎస్‌ విధానంతో ఎన్‌డీపీ, నాటుసారా, కల్తీ మద్యం, మాఫియా కట్టడితో మద్యం విధానంలో మంచి ఫలితాలొస్తున్నాయి. ఇవన్నీ వెరసి సరికొత్త స్థాయిలో మద్యం విక్రయాలు నమోదవుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి ముగిసేనాటికి ఆబ్కారీ శాఖ లెక్క ప్రకారం రాష్ట్రంలో మద్యం విక్రయాల వృద్ధి 20.11శాతంగా ఉంది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన కేరళ 15.1శాతం, కర్ణాటక 12.1శాతం వృద్ధిరేటును కనబర్చాయి. అయితే ఈ సమయంలో ఈ రెండు రాష్ట్రాల మద్యం విక్రయాలు తగ్గుదల నమోదయ్యాయి. తమిళనాడు రూ.21,831 కోట్లు కాగా, తెలంగాణలో రూ.28,894 కోట్లుగా నమోదైంది. కాగా తెలంగాణలో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు వరకు రికార్డుస్థాయిలో రూ.28,894 కోట్ల అమ్మకాల మార్కును చేరింది. ఇందులో మద్యం వాటా 80శాతం కాగా, బీర్‌ వాటా 20శాతంగా నమోదైంది. గతేడాదికంటే బీర్‌ విక్రయాల్లో 20శాతం పెరుగుదల నమోదు చేసుకోగా రానున్న వేసవి తాపం బీర్‌ విక్రయాలకు మరింత కలిసిరానున్నది. ఇప్పటివరకు 3.50 కోట్ల లిక్కర్‌, 4.52 కోట్ల పెట్టెల బీర్లు అమ్ముడయ్యాయి.

తమిళనాడులో మద్యం విక్రయాలు గతేడాది రూ.21,831 కోట్లుండగా ఈ ఏడాది ఇదే సమయానికి రూ.18,165 కోట్ల విక్రయాలకే పరిమితమైంది. కర్ణాటక గతేడాది రూ.13,870 కోట్ల అమ్మకాలుండగా ఈ ఏడాది రూ.12,383 కోట్లకు తగ్గుదల నమోదు చేసుకుంది. అయితే తెలంగాణ తర్వాత భారీ వృద్ధిరేటు కనబర్చింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కావడం గమనార్హం. బీర్‌ పెట్టెల విక్రయంలో తెలంగాణ గతేడాదితో పోలిస్తే 3కోట్ల 27లక్షల పెట్టెల నుంచి 4కోట్ల 52 లక్షల పెట్టెలకు చేరింది. మద్యం 2కోట్ల 32 లక్షల పెట్టెల నుంచి 3కోట్ల 53 లక్షల పెట్టెలకు పెరుగుదల నమోదైంది. మొత్తంగా గతేడాది కంటే ఇదే సమయంలో వృద్ధి రేటు 20.11 శాతంగా రికార్డయింది.

గడచిన ఏడాదికాలంగా పొరుగు రాష్ట్రాలకు అందనంత స్పీడ్‌తో బీర్‌ వినియోగంలో రాష్ట్రం ఉరుకులు పెడుతోంది. మైక్రో బ్రేవరీల పేరుతో బీర్లకు క్రేజీ పెరిగింది. దేశంలో ఎక్కడాలేనన్ని పబ్‌లు హైదరాబాద్‌లో నెలకొల్పడంతో బీర్‌ వినియోగం అమాంతం పెరిగింది. గతేడాది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 2,467.36 బల్క్‌ లీటర్ల బీర్‌ను సేవించిన ప్రజానీకం తలసరి బీర్‌ వినియోగంలో 6.99శాతాన్ని నమోదు చేసుకొంది. ఇది ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఇది దాదాపుగా 5రెట్లు ఎక్కువ. పొరుగున ఉన్న ఏపీలో 2.79శాతం తలసరి వినియోగం జరగ్గా, తమిళనాడులో 2.75శాతం, కర్ణాటక 3.27శాతం, కేరళ 2.26శాతంగా నమోదైంది. చౌక మద్యం విక్రయాల్లో దేశంలోనే నంబర్‌-1 స్థానంలో ఉన్న తెలంగాణ మొత్తం మద్యం వినియోగంలో మాత్రం కొంత వెనుకంజ వేసింది.

గల్లికో బెల్టు షాపు…
రాష్ట్రంలో జరుగుతున్న మద్యం విక్రయాల్లో బెల్టు షాపులే కీలక పాత్ర పోషిస్తున్నాయి. 8685 గ్రామాలు, 21వేల హాబిటేషన్లలో ఇవి నడుస్తున్నాయని తేలింది. ప్రతి గ్రామంలో సగటున ఐదు, హాబిటేషన్‌లలో మూడు చొప్పున బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని అంచనా. ఇవన్నీ కలిపితే రాష్ట్రంలో అనధికారకంగా లక్షకు మించి బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. వీటి ద్వారా ఏటా రూ.18 వేల కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం.

- Advertisement -

కఠిన నిబంధనలు…
రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. నూతన మద్యం విధానంలో భాగంగా షాపింగ్‌ మాల్స్‌, హైదరాబాద్‌లో రాత్రి 12గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతించిన తర్వాత ఉల్లంఘనలు పెరిగాయి. రాష్ట్రంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు 60శాతం విక్రయాలు సాగుతున్నాయని, రాత్రి 7 తర్వాత 12 గంటలవరకు ఒక్కసారిగా 40శాతం మద్యం వినియోగం జరుగుతున్నట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement