Tuesday, November 26, 2024

తెలంగాణ‌లో జ‌ర్మ‌నీ కంపెనీ రూ.1500 కోట్ల పెట్టుబ‌డి

తెలంగాణ‌కు అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. జ‌ర్మ‌నీకి చెందిన Liteauto GmbH అనే కంపెనీ తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. జ‌ర్మ‌నీ అంబాసిడ‌ర్ వాల్ట‌ర్ జే లిండ‌ర్, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మక్షంలో Liteauto GmbH కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ఈ కంపెనీ రూ. 1500 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. దీంతో దాదాపు 9 వేల మందికి ప్ర‌త్య‌క్షంగా, 18 వేల మందికి ప‌రోక్షంగా ఉపాధి ల‌భించ‌నుంది. ఈ కంపెనీ కార్లు, కామ‌ర్షియ‌ల్ వాహ‌నాలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు సంబంధించిన మెగ్నిషీయం భాగాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హాటల్‌లో జ‌రిగిన‌ జ‌ర్మ‌నీ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జ‌ర్మ‌నీ పెట్టుబ‌డుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆహ్వానం ప‌లుకుతుంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు 2 వేల ఎక‌రాల స్థ‌లం అందుబాటులో ఉంద‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు జ‌ర్మ‌నీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయ‌ని పేర్కొన్నారు. జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వం, అక్క‌డి పారిశ్రామిక వేత్త‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లే జ‌ర్మ‌నీ జీడీపీ వృద్ధికి స‌హ‌క‌రిస్తున్నాయని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో డిఫెన్స్ ల్యాబ్‌లు, ఏరోస్పేస్ ప‌రిశ్ర‌మ‌లు, ప‌రిశోధ‌నా కేంద్రాలు ఉన్నాయ‌ని, జ‌ర్మ‌నీ పెట్టుబ‌డిదారుడు ఎవ‌రైనా రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ పెట్టాల‌ని భావిస్తే దేశంలోని మిగ‌తా రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహాకాల‌ను అందించేందుకు కృషి చేస్తామ‌ని కేటీఆర్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement