టీఆర్ఎస్ నాయకుడు బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు గాయత్రి రవికి సీఎం కేసీఆర్ ఇవ్వాల (బుధవారం) బీ ఫారం కూడా అందజేశారు. గాయత్రి రవి తన రాజ్యసభ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి తగినంత సంఖ్యా బలం ఉండటంతో గాయత్రి రవినే ఎన్నిక కానున్నారు. ఈ పదవిలో వద్దిరాజు రవిచంద్ర 2024, ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు.
వద్దిరాజు రవిచంద్ర నేపథ్యం..
వద్దిరాజు రవిచంద్ర 1964, మార్చి 22న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో జన్మించారు. ఈయనకు భార్య విజయలక్ష్మి, కూతురు గంగా భవాని, కుమారుడు సాయి నిఖిల్ చంద్ర ఉన్నారు. ప్రస్తుతం రవిచంద్ర గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ మున్నూరు కాపు ఆల్ అసోసియేషన్ జేఏసీ గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తన సొంతూరులో బడులు, గుడులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యాలను కల్పించి.. గ్రామస్తుల హృదయాల్లో రవిచంద్రం చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ప్రతి పండుగకు తన వంతు ఆర్థిక సాయం చేస్తూ.. అంగరంగ వైభవంగా జరిగేలా సహకరించారు. మేడారం ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. 2016 లో జరిగిన జాతర సందర్భంగా రూ. 3.5 కోట్లు వెచ్చించి అమ్మవార్ల గద్దెలు, క్యూలైన్లకు గ్రానైట్ రాళ్లు, స్టీల్ రెయిలింగ్‌తో ఆధునీకరించారు. 2018లో సుమారు రూ. 20 లక్షలు వెచ్చించి మరికొన్ని క్యూలైన్లను ఆధునీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి 122 రకాల పూలను తీసుకొచ్చి అమ్మవారి గద్దెల చుట్టూ అలంకరించారు.
ఖమ్మం గ్రానైట్ పరిశ్రమకు గాయత్రి రవి క్వారీలే జీవనాధారం అని చెప్పొచ్చు. ఖమ్మంలో సుమారు 500 స్లాబ్ ఫ్యాక్టరీలు, వాటిలో 2000 కట్టర్లు, 150 టైల్స్ ఫ్యాక్టరీలు, మరో 10 ఎక్స్‌పోర్ట్ యూనిట్‌లు మనుగడ సాగిస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇంతటి భారీ పరిశ్రమకు 60 నుంచి 70 శాతం ముడి గ్రానైట్.. గ్రాయత్రి గ్రానైట్ సంస్థ నుంచే సరఫరా అవుతోంది.