Sunday, September 8, 2024

MDK: రాజ‌కీయ ల‌బ్దికి గ‌ట్టు పంచాయ‌తీనా… హ‌రీష్ పై మండిప‌డ్డ నీలం మ‌ధు

ఉమ్మడి మెదక్ బ్యూరో, జులై 18 (ప్రభ న్యూస్) : ఇద్దరు రైతుల మధ్య గట్టు పంచాయతీని రాజకీయాల అభివృద్ధికి వాడుకోవడం సిగ్గుచేటని మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గజ్వేల్ కు చెందిన రైతు కిష్టయ్యను గురువారం కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి పరామర్శించారు.

భూమి పంచాయతీలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన కిష్టయ్యకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించారు. తక్షణ సహాయం కింద లక్ష (1,00,000) రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నీలం మధు మీడియాతో మాట్లాడుతూ… ఇద్దరు రైతుల మధ్య ఉన్న చిన్న భూపంచాయతీని అదునుగా చేసుకొని మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం దమ్మక్క పల్లికి చెందిన రైతు కిష్టయ్యకు పక్కన రైతుతో గట్టు పంచాయతీ ఉండడంతో సర్వే నిర్వహించారని, అయితే పక్క రైతు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సర్వేలో తనకు అన్యాయం జరిగిందని రైతు కిష్టయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడడం బాధాకరమన్నారు.

- Advertisement -

అయితే ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయ లబ్దికి వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసి కుట్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు ప్రాణాపాయ స్థితిలో ఉంటే రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం చేయడం సరికాదని, ఇకనైనా ఈ దుర్మార్గపు కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఎంతమంది రైతుల ఉసురు పోసుకున్నారో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. మీరు పెట్టే గోసలు భరించలేక చితి పేర్చుకొని మంటల్లో రైతు సజీవ దహనం ఘటనను మాజీ మంత్రి గుర్తు తెచ్చుకోవాలన్నారు.

ప్రజలు బీఅర్ఎస్ పార్టీని తిరస్కరించినా మాజీ మంత్రి హరీష్ రావుకు జ్ఞానోదయం కలగకపోవడం విడ్డూరమన్నారు. ఇకనైనా అబద్ధపు ప్రచారాలు ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నామరూపాలు లేకుండా గల్లంతు చేస్తారని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని వివరించారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. నిరంతరం రైతు సంక్షేమమే ఎజెండాగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కిష్టయ్యకు అన్ని విధాలుగా అండగా నిలబడుతుందన్నారు. భూ పంచాయతీకి సంబంధించి అధికారులతో మాట్లాడి సర్వే నిర్వహించి కిష్టయ్యకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ఇకనైనా మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధపు ప్రగల్బాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు లింగా రావు, రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, సర్ధార్ ఖాన్, సమీర్, మతిన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement