Tuesday, November 26, 2024

గ్రూపుల‌కు ఆజ్యం పోసినోళ్ల‌కు పెత్త‌న‌మా…..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో నెలకొన్న గ్రూపు తగాదాలను పరిష్కరించే బాధ్యత ఆయా జిల్లా మంత్రులదేనని భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గుర్రుమంటు న్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన భారాస విస్తృత స్థాయి సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన కేసీఆర్‌ జిల్లాల్లో ముక్యంగా అసెంబ్లి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలను నిలువరించే బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్‌ చేసిన హుకుంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ జిల్లాల మంత్రులే తమ మధ్య విభేదాలు సృష్టించి చోద్యం చూస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రివల్లే నియోజకవర్గంలో పార్టీ ఇబ్బందులు పడుతోందని, నియోజకవర్గంలో ఉన్న నేతల మధ్య గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరడానికి మంత్రే బాధ్యుడని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ బీసీ ఎమ్మెల్యే వాపోయారు. తన రాజకీయ లబ్ధి కోసం తమ జిల్లా మంత్రి నియోజకవర్గంలో తన అనుచరులను ఆయన వైపుకు తిప్పుకుని రాక్షసానందం పొందుతున్నాడని తనను నానా ఇబ్బందులు పెడతున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అత్యంత సన్ని#హతుడైన ఓ నేతకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇప్పించడానికి మంత్రి తనకు వ్యతిరేకంగా లాబీయింగ్‌ చేస్తూ పార్టీ అధినాయకత్వం వద్ద తనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడని, మంత్రి కేటీఆర్‌కు అన్ని విషయాలు చెబుతూ వస్తున్నానని ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను తెచ్చుకున్న ఓ పోలీసు అధికారిపై లేనిపోని ఆరోపణలు చేసి తనకున్న అధికార బలంతో మంత్రి ఆ అధికారిని వెనక్కు పంపించేసి ఆయనకు అనుకూలంగా తాను వ్యతిరేకించిన అధికారిని తెచ్చారని పేర్కొన్నారు. తన నియోజక వర్గానికి తాను వద్దన్న పోలీసు అధికారిని తీసుకు వస్తే ఆ అధికారి తన మాట ఎలా వింటారని ఆ ఎమ్మెల్యే ప్రశ్నించారు. మంత్రి తెచ్చుకున్న పోలీసు అధికారి తాను ఫోన్‌ చేసినా స్పందించడం లేదని చెప్పారు.

మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు భయంకరంగా ఉన్నాయని భారాస నేతలే చెబుతుండడం విశేషం. దక్షిణ తెలంగాణ జిల్లాలో కీలక పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఒకరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పని చేస్తున్నారు. ఇక్కడ ఎంపీగా ఉన్న సీనియర్‌ నేత సదరు ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టాలని భావించి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది చూసి రెచ్చిపోయిన ఎమ్మెల్యే, జిల్లా పార్టీ చీఫ్‌ వాటిని తొలగించారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో గొడవలు మరింత ఉధృతమయ్యాయి. తన నియోజకవర్గంలో కాలు పెడితే ఖబడ్ధార్‌ అంటూ ఎంపీకి హెచ్చరికలు కూడా జారీ చేశారు. వచ్చే ఎన్నికలో ఎంపీ లేదా తన కుమారుడిని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. గత ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసినా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ కు ఈ గొడవలు ఎందుకని పార్టీ పెద్దలు చూసుకుంటారని వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేలు … మంత్రులు దూరం దూరం..
ఒకటి రెండు మినహా ఉమ్మడి జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా జరుగుతోందన్న ప్రచారం పార్టీలో బయట వినిపిస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేలకు అసలు పొసగడం లేదని అధికార కార్యక్రమాలలో ఎమ్మెల్యేల తెలపకుండానే మంత్రులు పాల్గొంటున్నారన్న ఫిర్యాదులు కోకొల్లలుగా ఉన్నాయి. పార్టీ అధిష్టానం ఆదేశం ప్రకారం మంత్రులు ఏ జిల్లాకు, అసెంబ్లిd సెగ్మెంట్లకు వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొందరు మంత్రులు ప్రైవేట్‌ కార్యక్రమాల పేరుతో పర్యటిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పడం లేదని సమాచారం మంత్రి వచ్చి వెళ్లిపోయాక విషయం తెలిసి ఎమ్మెల్యేలు సదరు మంత్రులను నిలదీసిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. చాలామంది మంత్రులు తమ కుటుంబ సభ్యులకు గతంలో తాము పని చేసిన పార్టీల నేతలను పార్టీ వైపు ఆకర్షించి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని దీంతో ఎమ్మెల్యేలతో మంత్రులకు అగాధం మరింత పెరుగుతుందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement