హైదరాబాద్ – యాసంగి ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపును మించి కొనుగోళ్లు జరిగాయన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ప్రకృతి వైఫరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసారు. ఈరోజు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులతో ఇదే అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్నివిదాలుగా అండగా ఉంటుందని, యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన అన్నధాతలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ధాన్యం వచ్చిన కొనుగోలుకు వీలుగా భారీగా 7142 కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే వీటిలో 4వేలకు పైగా ప్రారంభించి గత ఏడాది ఇదే రోజు 1.90 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా రెండున్నర రెట్లు అధికంగా 5.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసామన్నారు.
రోజుకు 90వేల మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తూ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుండి రక్షణగా 100 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిఫడా 1,45,163 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్యాడీ క్లీనర్లు సైతం 6,055, వెయింగ్ మిషన్లు 12,671, ఇతరత్రా మౌళిక సధుపాయాలను సైతం కల్పించామన్నారు. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాల వద్దకు వెల్లి చేయాల్సింది రాజకీయం కాదని, రైతులకు భరోసా కల్పించి కేంద్రం నుండి బాయిల్డ్ రైస్ కు సానుకూలంగా నిర్ణయం ఇప్పించాలని ప్రతిపక్షాలకు సూచించారు మంత్రి గంగుల.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాల మేరకే ధాన్యం సేకరించవలసి వస్తుందని, ఐనప్పటికీ అకాల వర్షాలతో తడిసిన ధాన్యం విషయంలో కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వీటిని రైతులు ఆరబోసి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని భరోసా నిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.