Sunday, November 24, 2024

తెలంగాణాలో వేరే పార్టీల‌కు పుట్ట‌గ‌తులుండ‌వు – మంత్రి గంగుల‌

క‌రీంన‌గ‌ర్ : తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి అవకాశమే లేదని, వేరే పార్టీలు రావని.. వచ్చినా బతకవని కుండబద్దలు కొట్టారు. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ నడవవన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వెనుక‌బ‌డిన కులాల ను మోసం చేస్తున్న‌ది భార‌తీయ జ‌న‌తా పార్టీనే అని బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ పేర్కొన్నారు. ‌బండి సంజ‌య్‌కు బీసీల‌పై ప్రేమ ఉంటే.. కేంద్రంలో త‌క్ష‌ణ‌మే బీసీ సంక్షేమ శాఖ‌ను ఏర్పాటు చేయించాల‌ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బీసీలు ఆత్మ‌గౌర‌వంతో బ‌తుకుతున్నార‌ని తెలిపారు. కోకాపేట‌లో బీసీల కోసం ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నం నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. మిగ‌తా అన్ని చోట్ల మార్చి నెల‌లో ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల నిర్మాణం ప్రారంభ‌మ‌వుతుంద‌ని మంత్రి పేర్కొన్నారు. 17 ఉప‌కులాల‌ను బీసీల్లో చేర్చిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది అని తెలిపారు. బీసీ విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్ కోసం రూ. 9 వేల కోట్లు ఇచ్చామ‌న్నారు. కాలేజీలు, స్కూళ్ల‌ల్లో ఈ నాలుగు నెల‌ల‌కు మాత్ర‌మే ఫీజులు వ‌సూలు చేసేలా నిబంధ‌న‌లు జారీ చేస్తామ‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement