హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: జూబ్లిహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌తో పాటు ముగ్గురు మైనర్లను విడివిడిగా విచారించిన పోలీసులు అత్యాచారానికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. అత్యాచార ఘటనలో ముగ్గురు మైనర్లు మేజర్‌గా ఉన్న మాలిక్‌పై, మైనర్లపై మాలిక్ పోటా పోటీ ఆరోపణలు చేసినట్టు సమాచారం. అత్యాచారం కేసును విచారిస్తున్న బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, ఇతర అధికారులు నలుగురు నిందితులను విడివిడిగా కూర్చోబెట్టి కూపీ లాగినట్టు సమాచారం. అయితే సామూహిక అత్యాచారం కేసులో తమ తప్పేది లేదంటున్న మైనర్లు సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టాడని ఆరోపించినట్టు సమాచారం. తనకంటే ముందు బాధిత మైనర్ బాలికతో అసభ్యంగా మైనర్లే వ్యవహరించారని సాదుద్దీన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.
బెంజి కారులో ఎమ్మెల్యే తనయుడు బాలికపై తొలుత అసభ్యంగా ప్రవర్తించాడని, ఈ విషయంలో తమను రెచ్చగొట్టాడని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాన్సూ బేకరీ నుంచి బయలుదేరినపుడు మార్గమధ్యలోనే ఎమ్మెల్యే కుమారుడు వాహనం దిగి వెళ్లిపోయాడని, తమతో రాలేదని మైనర్లు చెప్పినట్టు తెలుస్తోంది. బెంజి కారును కాన్సూ బేకరీ ప్రాంతంలో పార్కింగ్ చేసి ఇన్నోవా వాహనంలో ఐదుగురం వెళ్లామని చెప్పారు. ఘటన అనంతరం పోలీసులకు ఫిర్యాదు అందడంతో తామంతా హైదరాబాద్ వదిలి పారిపోయామని, ఎక్కడికి వెళ్లాలన్నది ముందుగా నిర్ణయించలేదని చెప్పారు. పోలీసుల కస్టడీకి విచారణలో పాతబస్తీకి చెందిన ఓ స్థానిక టీవీ ఛానల్ సీఈవో కుమారుడు మైనర్ ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వైద్య పరీక్షలు ఆలస్యం కావడంతో పోలీసులు ముగ్గురు మైనర్లను తొలిరోజు శనివారం కేవలం గంట మాత్రమే విచారించి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వారిని సైదాబాద్‌లోని జువైనల్ హోంకు తరలించారు.