Friday, November 22, 2024

Followup: గుడి ప్రాంగణంలోనే గ్యాంగ్ రేప్ జ‌రిగింది.. వీడియో ఆధారాలున్నాయ్: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జూబ్లిహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటనఒక దేవాలయం ప్రాంగణంలోనే జరిగిందని, అయితే ఘటన ఎక్కడ జరిగిందో హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ సీవీ ఆనంద్‌ చెప్పలేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. దేవుడు గుడి ప్రాంగణంలోనే జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఒక ఒప్పందంతోనే ఎమ్మెల్యే రఘునందన్‌ రావు వీడియో బయటపెట్టారని ఆయన ఆరోపించారు. గ్యాంగ్‌ రేప్‌ జరిగిన అసలైన వీడియో లేదని, దానిని ఎడిట్‌ చేసి మరోలా చూపించారని ఆయన అన్నారు. కేసును బలహీనపర్చడానికే ఇలా చేశారన్నారు. బాలిక అత్యాచార ఘటనలో 8 మంది ఉన్నట్లు మొదట వెల్లడించిన పోలీసులు తర్వాత ఆరుగురిపైనే కేసు నమోదు చేశారన్నారు.

మిగిలిన ఇద్దరు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు మొదట చెప్పిన ప్రకారం బెంజ్‌ కారులో నలుగురు, ఇన్నోవా కారులో నలుగురు మొత్తం ఎనిమిదిమందని ఆయన తెలిపారు. బుధవారం బచావో హైదరాబాద్‌ పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలు – పరిరక్షణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.. ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలు క్లబ్‌లు, పబ్‌లను నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద రెండు పబ్‌లు 24 గంటలు నడుస్తున్నాయని, వాటిలో ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

సీనీ ఇండస్ట్రీలో పట్టు కోసం డ్రగ్స్‌ కేసు ఇన్వేస్టిగేషన్‌ చేశారని, యువరాజుకు పట్టు వచ్చాకా డ్రగ్స్‌ కేసును నీరుగార్చారని ఆయన విమర్శించారు. తెలంగాణలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌ వచ్చేందుకు ఎన్నారైలు భయపడుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి నెలకోసారి సీఎం సమీక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధితులకు భరోసా కల్పించి, నేరస్థులు భయపడేలా నిర్ణయాలు ఉండాలని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ తన కుటుంబ అవరాలను పక్కనపెట్టి మహిళల సమస్యలను పట్టించుకోవాలన్నారు.

శాంతిభద్రతల అంశం కీలకమైనదని, ప్రతిపక్షాలు, మహిళల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. బాలిక అత్యాచార ఘటనలో నేరస్థులకు శిక్షపడేలా సీఎం కేసీఆర్‌ వ్యవహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రేపటి తెలంగాణ ఎలా ఉండాలో ఆలోచిస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. బెల్టుషాపులను మూసివేస్తామని, పబ్‌ల నిర్వహణను క్షమించబోమని హెచ్చరించారు.

కేసీఆర్‌ చెక్కుచేతల్లోని అధికారులకు రెండేసీ పోస్టింగులు
సీఎం కేసీఆర్‌ చెక్కుచేతల్లో ఉండే వారికే రెండేసీ పోస్టింగ్‌లు ఇస్తురన్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. నచ్చినోళ్ళకు నజరానా, నచ్చనోళ్లకు జరిమానా ఇస్తున్నారని అన్నారు. నలుగురైదుగురు అధికారులు కేసీఆర్‌కు గంపగుత్తగా పని చేస్తున్నారని విమర్శించారు. ఐపీఎస్‌ అధికారులు జితేందర్‌, కమలహాసన్‌ రెడ్డి, అంజనీ కుమార్‌, సంజయ్‌ కుమార్‌ జైన్‌లకు రెండేసీ పోస్టింగ్‌లను కట్టబెట్టారని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు ఫేవర్‌ చేయడానికే వీళ్ళంతా పని చేస్తున్నారని ఆరోపించారు. సమర్ధవంతమైన అధికారులను పక్కనపెట్టడం దారుణమన్నారు.

- Advertisement -

సమర్థులైన వారిని ఇంట్లో కూర్చోబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమోషన్‌ పొందిన వాళ్ళను కూడా ఊరికే కూర్చోబెట్టారని ఆయన తెలిపారు., 20 ఏళ్ళ క్రితం రిటైర్‌ అయిన వారికి రెగ్యూలర్‌ పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు సమర్థులను పక్కనపెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారని అన్నారు. రాచకొండ పరిధిలో ఒక అధికారి ఏడున్నరేళ్ళగా ఒకే పోస్టులో కొనసాగుతున్నారని తెలిపారు. లబ్దిపొందిన అధికారులను చట్టానికి కాకుండా వ్యక్తికి విధేయులుగా ఉంటున్నారని ఆయన విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement