Wednesday, July 3, 2024

Gandhi Hospital – నిరుద్యోగుల‌ను వెంటాడిన పోలీసులు… మీడియాపై పోలీసుల దౌర్జ‌న్యం


నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌కు మ‌ద్ద‌తుగా గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు తండోప‌తండాలుగా నిరుద్యోగులు చేరుకున్నారు. అయితే.. సోమవారం గాంధీ హాస్పిట‌ల్ మెయిన్ గేటు వైపు నిర‌స‌న‌గా వ‌చ్చిన నిరుద్యోగుల‌ను పోలీసులు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. నిరుద్యోగుల వైపు పోలీసులు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు దూసుకెళ్లి వెంబ‌డించారు. దీంతో నిరుద్యోగ యువ‌తీయువ‌కులు అక్క‌డున్న మెట్రో స్టేష‌న్లోకి ప‌రుగెత్తారు. శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న నిరుద్యోగులపై పోలీసుల తీరు స‌రిగా లేద‌ని నిరుద్యోగులు మండిప‌డ్డారు.

అడుగడుగునా అడ్డగింపు..

మ‌రోవైపు గాంధీ మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్ భ‌వ‌నాల వైపు నుంచి కొంత మంది విద్యార్థులు గాంధీ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలోకి చేరుకున్నారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు హాస్ట‌ల్ భ‌వ‌నాల వ‌ద్ద ఉన్న క్యాంటీన్ వైపు వెళ్లి నిరుద్యోగుల‌ను అడ్డుకున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ఈ స‌మ‌యంలోనే క‌వ‌రేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్ర‌తినిధుల ప‌ట్ల పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. అనంత‌రం నిరుద్యోగుల‌ను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత వారిని బొల్లారం పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఇక గాంధీ ఆస్ప‌త్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో నిరుద్యోగుల నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు నెల‌ల్లోనే 25 వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ వేస్తామ‌న్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు స్పందించ‌డం లేద‌ని నిరుద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు.

- Advertisement -

మీడియాపై పోలీసుల దౌర్జ‌న్యం

హైద‌రాబాద్‌లోని గాంధీ హాస్పిట‌ల్ లో క‌వ‌రేజ్‌కు వెళ్లిన మీడియా ప్ర‌తినిధుల‌పై పోలీసులు దౌర్జ‌న్యం చేశారు. ఓ కెమెరామెన్‌పై అక్క‌డ డ్యూటీలో ఉన్న‌ ఎస్ఐ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. కెమెరామెన్‌ను నెట్టిప‌డేశారు. అంతేకాకుండా ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో కూడా మ‌రో పోలీసు అధికారి వాగ్వాదానికి దిగారు. దీంతో మీడియా ప్ర‌తినిధులు పోలీసుల తీరుపై మండిప‌డ్డారు. మీడియాను అడ్డుకోవ‌డం ఏంట‌ని నిల‌దీశారు. పోలీసుల తీరు స‌రిగా లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తంగా గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద స్థానిక పోలీసుల‌తో పాటు సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. గాంధీ ఆస్ప‌త్రిలోకి వెళ్లే ప్ర‌తి ఒక్క‌రిని త‌నిఖీ చేసిన త‌ర్వాతే హాస్పిట‌ల్‌లోకి పంపిస్తున్నారు పోలీసులు. మీడియాను మాత్రం హాస్పిట‌ల్‌లోకి అనుమ‌తించ‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement