ప్రపంచాన్ని గజగజవణికిస్తోన్న కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజు కు కరుణ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఇండ్లలోనే ఉండటం సురక్షితం అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ఆస్పత్రులకు వెళ్లకూడదని సూచించారు. కరోనా వ్యాప్తిని ఆపడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఆస్పత్రుల్లోనూ వైరస్ అంటుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేవు. ఎవరికి వాళ్లే సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గాంధీ ఆస్పత్రిలో నిన్న ఒక్కరోజే 150 మంది కొవిడ్ రోగులను చేర్చుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గాంధీలో ఐసీయూ సామర్థ్యం 350 పడకలే అని చెప్పారు. గతంలో పోలిస్తే ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్య సిబ్బందిలోనూ గతం కంటే ఇన్ఫెక్షన్ అధికంగా ఉందని రాజారావు పేర్కొన్నారు. వైరస్ బాధితుల రాక ఇదే విధంగా కొనసాగితే పరిస్థితులు కష్టతరమవుతాయన్నారు. మొత్తం 1450 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని చెప్పారు. ఆక్సిజన్ పడకలు ఉన్నా ఐసీయూ పడకల అవసరం ఉందన్నారు.