హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న గేమింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళవారం ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడలో ఉన్న ఏసీ అట్లాంటిక్స్ అపార్ట్‌మెంట్ పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు.
ఓ మహిళ అక్రమంగా పేకాట డెన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. దాడి చేసి దాదాపు 62 వేల రూపాయలు స్వాధీనం చేసుకుని 9మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతకొంత కాలంగా కమ్మంపాటి మాధవి అనే మహిళ అక్రమంగా గేమింగ్(మూడు ముక్కలాట) నిర్వహిస్తుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుండి ఫంటర్స్ ను పిలిపించి పెద్దఎత్తున గేమింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఆటకు రూ.వేయి ఆర్గనైజర్ ఫీ వసూలు చేస్తూ.. రోజులో సుమారు 100 లకు పైగా గేమ్ లను నిర్వహిస్తుందని పోలీసులు తెలిపారు.