ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : కోల్‌కాతా లోని ఓ ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా గమన్ హాస్పిటల్స్ ఈరోజు ఔట్ పేషెంట్ సేవలు, శస్త్రచికిత్సలను నిలిపివేసింది. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగించింది.
కాగా, బాధితురాలికి న్యాయం, వైద్య నిపుణులకు మెరుగైన రక్షణ కోరుతూ గమన్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది శనివారం హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గమన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నంద కిషోర్ మాట్లాడుతూ, కోల్ కతా ఘటనను ఖండించారు.
తాము ఐఎంఏ ఇచ్చిన సమ్మె పిలుపునకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు… అలాగే బాధితురాలికి న్యాయం జరిగే విషయంలో ఐఎంఏ తీసుకున్న చర్యలను బలపరుస్తున్నామని చెప్పారు. వైద్యుల భద్రత, ముఖ్యంగా శిక్షణలో ఉన్నవారి భద్రత చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.
ఈ ర్యాలీకి డాక్టర్ కిషోర్, హాస్పిటల్ డైరెక్టర్లు భాస్కర్ రావు, ఇందీవర్ రెడ్డి నేతృత్వంలో వహించారు.. డాక్టర్ లవకుమార్ రెడ్డి, డాక్టర్ భరత్, డాక్టర్ తిరుపతి లతో సహా పలువురు వైద్యులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.