గద్వాల జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. జడ్పీ చైర్పర్సన్ సరిత పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను ఇవ్వాల (బుధవారం) అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ వివరాలను స్వయంగా సరిత మీడియాకు వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్ ను వీడి ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. రేపు (గురువారం) ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని సమాచారం అందుతోంది.
గద్వాల నియోజకవర్గంలో కొన్నిరోజులుగా ఎమ్మెల్యేకు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు పడడం లేదు. వారి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా సరిత అధికార పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సరిత దంపతులతో చర్చలు జరిపి, కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారనే ప్రచారమూ ఉంది.
ఇక.. వారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు (గురువారం) కొల్లాపూర్ లో నిర్వహించాల్సిన సభలో కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ సభను 30వ తేదీకి వాయిదా వేశారు. అయితే.. వారు అనుకున్నట్టు సరిత దంపతులు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.