తిమ్మాపూర్/ సూర్యాపేట, జూన్ 27 : సీఎల్పీ నేత, జన నాయకుడు భట్టి విక్రమార్క 104 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరోసారి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తాజగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామంలో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కతో కలిసి ఆయన కూడా ముందుకు నడిచారు. ఈ సందర్బంగా తిమ్మాపురం గ్రామంలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఆదిలబాద్ జిల్లా ఇచ్చోడ వద్ద భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమైందని అన్నారు. వ్యక్తిగా, గద్దర్ ప్రజాపార్టీని రిజిస్టర్ చేసిన తరువాత ఒక పార్టీగా మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఒక బలీయమైన రాజకీయ శక్తిగా మారాలని ఈ సందర్భంగా ఆయన పిలుపిచ్చారు. ఈ పాదయాత్రను మహత్తమైన ఓట్ల శక్తిగా మారుతుందని గద్దర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పదేళ్లనుంచి సాగుతున్న నియంతల పాలనకు గుణపాఠాలు ప్రజలంతా చెప్పాలని అన్నారు. అంతేకాక రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్కలా పల్లెల్లోకి వెళ్లాలన్నారు. అంతేకాక ఇంటింటికి వెళ్లి.. ప్రతి ఇంటిని ఒక బూత్ గా మార్చాలని అన్నారు. ప్రతి ఇంటిని ఒక ఓట్ల శక్తిగా మార్చి.. నియంతల పాలనకు ముగింపు పలకాలన్నారు. దేశంలో ఇప్పుడు 18 నుంచి 35 ఏళ్ల మధ్యనున్నవారు 60 కోట్ల మంది ఉన్నారు.. వీరంతా గత పదేళ్లుగా సాగుతున్న పాలనపై ఒక మంచి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లేయాలని ఆయన పిలుపిచ్చారు. 75 ఏళ్లున్న నేను కూడా భట్టి విక్రమార్క పాదయాత్రలె నడుస్తున్నాను. యువత కూడా ఇలా స్వచ్ఛందంగ ఆ ముందుకు వచ్చి పాదయాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపిచ్చారు.
అలరించిన ఆటపాట
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ప్రజాయుద్ధనౌక గద్దర్ పలు పాటాలు పాడారు. ముఖ్యంగా మీడిమా మాట్లాడుతూ ఆయన పాడిన పాటలు అక్కడున్న ప్రజల్ని విశేషంగా అకట్టుకున్నాయి. గద్దర్ పాటలతో ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున గొంతు కలిపారు. ఆయనతో పాటు వారు కూడా పాటలు పాడుతూ భట్టి విక్రమార్కకు మద్దతు తెలిపారు. అంతేకాక మహిళలతో కలిసి గద్దర్ పాటలు పాడుతూ.. కోలాటలు ఆడారు. ఈ సందర్భంగా గద్దర్ పాటలకు.. విశేషమైన ప్రజా స్పందన వచ్చింది.