హైదరాబాద్ – వేములవాడ టెంపుల్‌కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, హైదరాబాద్ ట్రాఫిక్, గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. కాగా, వేములవాడలో బ్రిడ్జి నిర్మానానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. అంతేకాకుండా వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీనిచ్చారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్‌పై కూడా సీఎం సమీక్షించారు. దీనికి డీజీపీ సహా ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ, అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం చర్చించారు..