తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు (శనివారం) వరంగల్ రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపడుతోంది. వరంగల్ సిటీని పోలీసు అధికారులు హైసెక్యూరిటీ జోన్‌గా మార్చారు. SPG, కేంద్ర, రాష్ట్ర బలగాలతో అంచలంచెలుగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ముందస్తుగా కేంద్ర బలగాలు సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వరంగల్ చుట్టూ 20 కిలో మీటర్ల మేర 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
ఇక వరంగల్ సిటీలో రేపు (శనివారం) నో ఫ్లై జోన్ ఆంక్షలు అమలు కానున్నాయి. డ్రోన్‌లు, రిమోట్ కంట్రోల్ పరికరాలు, ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లయింగ్ వంటివాటిపై నిషేధం ఉంటుంది. ఇక ప్రధాని సందర్శించనున్న భద్రకాళి ఆలయం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. అణువణువునా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
మూడంచెల భద్రత ఏర్పాటు: సీపీ రంగనాథ్
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా మూడెంచల భద్రత ఏర్పాటు చేసినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కేంద్ర బలగాలకు అదనంగా ఇద్దరు ఐజీ స్థాయి అధికారులను కేటాయించారు. అంతేకాకుండా మరో 10 మంది డీసీపీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణ కూడా ఉండనుంది. వీరితో పాటు.. 56మంది సీఐలు, 250 మంది ఎస్సైలు, 3500 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారని సీపీ రంగనాథ్ వెల్లడించారు.