- సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పాఠశాలలో ఈ దుస్థితి
- పట్టించుకోని ఉన్నతాధికారులు
వాజేడు, అక్టోబర్ 17( ఆంధ్రప్రభ) : గిరిజనుల అభ్యున్నతి కోసం ఏర్పడిన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పాఠశాలలో కనీసం ఒక ఉపాధ్యాయుడు కూడా లేని పరిస్థితి ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఏర్పడింది. వాజేడు మండలం జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 40మంది విద్యార్థులు ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు.
ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యాబోధన అందించాల్సి ఉండగా ఇక్కడి ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు బదిలీపై పంపించారు. ఈ పాఠశాలలో ఇవాళ ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయున్ని కూడా భర్తీ చేయకుండా కొంగల పాఠశాలకు చెందిన తాత్కాలిక ఉపాధ్యాయున్ని పంపిస్తున్నారు.
దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది. ఉన్నతాధికారుల పట్టింపు లేకపోవడం వలన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి జంగాలపల్లి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఐటీడీఏ డీడీ పోచమును ఫోన్ లో వివరణ కోరగా.. ఈ విషయం ఇంతవరకు తన దృష్టికి రాలేదని, వెంటనే అక్కడి విషయం తెలుసుకొని ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని తెలిపారు.