సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ఫోరెన్సిక్ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఎల్) సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులు విధ్వంసం సృష్టించి రైళ్లకు నిప్పుపెట్టి భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో 70మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి సెల్‌ఫోన్లను సీజ్ చేసిన అధికారులు వాట్సాప్ గ్రూపుల్లో స్టేషన్‌పై దాడికి సంబంధించిన చర్చ జరిగిన వైనాన్ని గుర్తించారు.
ఆర్మీ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సుబ్బారావు సహా మొత్తం 70మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారి ఫోన్లను రైల్వే పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విధ్వంసం జరిగిన రోజున చోటుచేసుకున్న పరిణామాల వివరాలను సేకరించారు. దీనికి సంబంధించిన నివేదిక సిద్ధమైందని, దీంతో త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన ఛార్జీషీట్‌ను దాఖలు చేస్తామని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చెబుతున్నారు.