వికారాబాద, ప్రభన్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలను కట్టబెడుతోంది. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్లపై పనిభారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించింది. అయినా కలెక్టర్లకు అనునిత్యం ఊపిరిసలపని పనులు ఉంటున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను జిల్లాలో అమలు చేసే బాధ్యతలను పూర్తిగా కలెక్టర్లకు అప్పగిస్తున్నారు. ఈ కారణంగా కలెక్టర్లపై తీవ్ర పనిభారం ఉంటోంది. కొన్ని సందర్భాలలో జిల్లా కలెక్టర్లు రోజుల తరబడి కార్యాలయం దాటి క్షేత్ర పరిశీలనకు సైతం రాలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం సేకరణ జరుగుతోంది. జిల్లాలో వరిధాన్యం సేకరణ బాధ్యతలను పూర్తిగా జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టింది ప్రభుత్వం. జిల్లాలో ఎక్కడ కేంద్రాలను ప్రారంభించాలన్నా జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ధరణి పోర్టల్ బాధ్యతలను మొదటి నుంచి జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ధరణిలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తాయి. వీటిని పరిష్కరించుకునేందుకు పట్టాదారులు ప్రతిరోజు భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తుల సంఖ్య పెరిగిపోయిన ప్రతిసారి ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది.
ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పోడు సమస్య పరిష్కారం నిర్ణయం..కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం నిర్ణయం అమలు చేసే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఈ దరఖాస్తుల పరిశీలన స్వయంగా జిల్లా కలెక్టర్లు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. పోడు దరఖాస్తులకు తోడు కోవిడ్ మృతులకు పరిహారం చెల్లించే బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. కోవిడ్ బాధితుల నుంచి దరఖాస్తుల సేకరణను ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకే సారి జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకాలను ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. వంద శాతం టీకాలను ఇచ్చే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. నిత్యం జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు టీకాల స్పెషల్ డ్రైవ్‌ను పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లపై పెను పనిభారం మోపుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital