Saturday, November 23, 2024

ఈ నెల 7 నుంచి నేతన్న బీమా.. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు ఆర్థిక భరోసా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నేతన్న బీమా పథకంపై ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమ విజయవంతం కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5 లక్షలు అందుతుందని కేటీఆర్‌ తెలిపారు. లబ్ధిదారులు చనిపోయిన 10 రోజుల్లో ఈ మొత్తం నామినీ ఖాతాలో జమ అవుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులు ఎవరైనా దరుదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రి చెప్పారు. నేతన్నకు బీమా పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందని ఈ మేరకు భారత జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు.

వార్షిక ప్రీమియం కింద చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వివరించారు. ప్రీమియం కోసం రూ.50 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 60 ఏళ్లలోపు వయసున్న చేనేత మరమగ్గ కార్మికులందరూ నేతన్న బీమా పథకానికి అర్హులని చెప్పారు. సుమారు 80 వేల మంది చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా వర్తిస్తుందని పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులు, అనుబంధ కార్మికులందరికీ నేతన్నబీమా పథకాన్ని అమలు చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. చేనేత కార్మికులు నిత్యం మగ్గం గుంతలో కూర్చొని కంటికి కనిపించని పోగులతో పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే బరువైన యంత్రాలను తొక్కాల్సి వస్తోంది. ఈ క్రమంలో 40 ఏళ్లకే చాలా మందిఇ అనారోగ్యాల బారిన పడుతుండడంతో వారి జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా మరణించినా ఏదైనా ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ఈ మొత్తం వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తుంది’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement