Friday, November 22, 2024

Special story : టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య దోస్తీ..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు నేటికీ టికెట్ల కేటాయింపులో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐదు శాసనసభ స్థానాలు ఉండగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురికి మాత్రమే పార్టీ టికెట్లు కేటాయించారు. బీజేపీ పార్టీ సైతం ముగ్గురు అభ్యర్థులకు టికెట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ బీజేపీ పార్టీలో శాసించే స్థాయికి ఎదిగారు. జిల్లాలో తన అనుచరులకే టికెట్లు ఇప్పించే ప్రయత్నంలో మునిగితేలారు. నిజామాబాద్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, నిజామాబాద్ కార్బన్ స్థానానికి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు బీజేపీ టికెట్లు కేటాయించింది. నిజామాబాద్ రూరల్, బోధన్ స్థానాల కేటాయింపులో కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్నేహంతో మెలుగుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మపురి సంజయ్ టికెట్లు ఆశిస్తూ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నుండి ధర్మపురితో పాటు మహేష్ కుమార్ గౌడ్ పోటీలో నిలిచారు. అర్బన్ స్థానాన్ని ఎటూ తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు ధర్మపురికి చెక్ పెట్టేందుకు మరో ఎత్తుగడ వేశారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి ఓటమిపాలైన ఆకుల లలితను కాంగ్రెస్ పార్టీలో చేర్చి అర్బన్ స్థానాన్ని ఇప్పించే ప్రయత్నం చేశారు.

నిజామాబాద్ జిల్లాకు రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలో పార్టీలో ఆకుల లలితను చేర్చి టికెట్ ఖరారు చేయాలనే ప్రయత్నాలు చేశారు. ఆకుల లలిత గత ఎన్నికల్లో ఆర్మూర్ లో పోటీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిందని జిల్లాకు చెందిన పలువురు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలోకి తీసుకోవద్దని నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు అధిష్టానానికి మొరపెట్టుకోవడమే కాకుండా హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నడుపుతున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సైతం విముఖత వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అంతా ఒకటై ఆకుల లలితను పార్టీలో చేరడంలో అడ్డుకట్ట వేయగలిగారు. ఆకుల లలిత భర్త రాఘవేందర్ ఢిల్లీ స్థాయిలో రాజకీయ పావులు కదిపారు. ఇప్పటికైతే వారికి చుక్కెదురైనట్లే చెప్పుకోవచ్చు.

నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి గతంలో డి.శ్రీనివాస్ 30ఏళ్ల పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లోనూ డి.శ్రీనివాస్ కీలకపాత్ర వహించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం డి.శ్రీనివాస్ ఇంటికి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లడంతో డీఎస్ ఆనాడు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ బాస్ డీఎస్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ పోటీ చేసి నిజామాబాద్ లో కాషాయం జెండా ఎగురవేశారు. అరవింద్ ఎంపీగా గెలుపొందడంతో గులాబీ దళం ధర్మపురి కుటుంబంపై గుర్రు పెట్టారు. కొన్నేళ్లపాటు డీఎస్ బీఆర్ఎస్ లోనే ఉంటూ సైలెంట్ గా తన రాజకీయ జీవితాన్ని గడిపారు.

- Advertisement -

బీజేపీ, కాంగ్రెస్ లో స్నేహం బలపడేనా..
నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఎంపీ అరవింద్ సోదరుడు సంజయ్ ఆశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సుదర్శన చక్రం తిప్పుతున్నారు. జిల్లాలోని ఐదు స్థానాలకు గాను తనతో పాటు మరో ఇద్దరు తన అనుచరులకే మాజీ మంత్రి టికెట్లను ఇచ్చే విషయంలో చక్రం తిప్పారు. మరో రెండు స్థానాలకు నేటి వరకు అభ్యర్థుల ప్రకటన విషయంలోనే పోటాపోటీగా అభ్యర్థులు ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఆశించి తిరిగి పాత గూటికి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆకుల లలిత పావులు కదిపారు. ఐదేళ్ల నుండి పార్టీ కోసం కష్టపడిన వారిని వదిలేసి గతంలో పార్టీకి మోసం చేసిన వారికి టికెట్ ఎలా ఇస్తారని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తమ నిరసన గళాన్ని అధిష్టానానికి వినిపించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆకుల లలితను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి పార్టీలో చేరే విషయంలోనే ఆకుల లలితకు చుక్కలు చూపించారు.

నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ కి ఇప్పించాలని ఆంతరంగికంగా సుదర్శన్ రెడ్డితో స్నేహం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంపీ సోదరుడికి నిజామాబాద్ అర్బన్ స్థానం టికెట్ ఇప్పిస్తే బోధన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గెలుపునకు సహకరిస్తానని ఎంపీ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలిసింది. తన సోదరుడికి అర్బన్ లో టికెట్ ఇప్పిస్తే బోధన్ బీజేపీ టికెట్ బలహీనమైన వ్యక్తికి ఇప్పించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరిస్తానని ఎంపీ అరవింద్ మాటిచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. గత వారం రోజుల క్రితం బీజేపీ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సమావేశంలోనూ సుదర్శన్ రెడ్డి మంచివాడని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు దేశద్రోహులంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేయడంపై ఆనాడే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీలో ధర్మపురి కుటుంబం, కాంగ్రెస్ పార్టీలో పొద్దుటూరు కుటుంబం పై చేయిగా రాజకీయ పావులు కదుపుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ లు ఇలా స్నేహభావంతో మెలిగి అర్బన్ స్థానాన్ని, బోధన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ పదిల పరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ స్థానాలను ఆశించారు. అర్బన్ స్థానాన్ని ధన్ పాల్ కు ఇప్పటికే ఖరారు చేశారు. రూరల్ స్థానాన్ని ఎండలకు కేటాయించాలని అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఎంపీ మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఎండలకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఎండలను ఎమ్మెల్యేగా పోటీ చేపించాలని అధిష్టానానికి బలంగా ఉంటే బాన్సువాడ నుండి బరిలోకి దింపాలని అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. రెండు రోజులుగా ఎండల ఎంపీ సైతం రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎండల లక్ష్మీనారాయణకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు బీజేపీ ఆంతరంగికులు ప్రచారం చేస్తున్నారు. బోధన్ లో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసేందుకు గత రెండేళ్ల నుండి పార్టీ కార్యక్రమాలు మేడపాటి ప్రకాశ్ రెడ్డి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ ని కూడా నియోజకవర్గంలో మేడపాటి పెంచుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ల స్నేహ సంబంధాలతో మేడపాటికి చెక్ పెట్టి మరో వ్యక్తికి బీజేపీ టికెట్టు కేటాయించాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు బోధన్ బీజేపీలో చోటు చేసుకుంటే పార్టీకి కూడా పలువురు దూరమయ్యే ప్రమాదం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ బోధన్ లో డిపాజిట్లను పోగొట్టుకుంది. ప్రస్తుతం మేడపాటి ప్రజల్లోకి దూసుకువెళుతూ ప్రజాదరణను చూరగొన్నారు. పెద్దల స్నేహం ప్రకాష్ రెడ్డికి శాపంగా మారితే బీజేపీ పార్టీ మనుగడ బోధన్ లో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement