Friday, November 22, 2024

Friendly Government – 18 గంటలు పని చేయండి… లేదంటే తప్పుకోండి – ఐఏఎస్‌, ఐపీఎస్‌ లకు రేవంత్ రెడ్డి వార్నింగ్

హైదరాబాద్ – ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే, ప్రతీ ఒక్కరూ పని చేయాల్సిందే. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు రోజుకు 18 గంటలు పని చేయండి.. పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోండి.. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్‌, డీజీపీకి చెప్పి తప్పుకోండి.. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి అని సి ఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్టు తెలిపారు..

సమీక్ష సందర్బంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దులుగా పనిచేయాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమన్వయం లేకపోతే టార్గెట్‌ రీచ్‌ కాలేం. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లదే. ప్రజాపాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలి. నిస్సహాయులకు సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అంటే అద్ధాల మేడలు, రంగుల గోడలు కాదు. చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులదే. గ్రామసభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యేలాగా వినిపించాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందించడమే మా లక్ష్యం.

పోలీసులకు ఫ్రీడమ్‌..

అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం. భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలి. భూకబ్జా అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్‌ మై షో, సన్‌బర్న్‌ నిర్వహణపైన పోలీసులు నిఘా పెట్టి అసలు విషయాలు తేల్చాలి. వీటి వెనకాల ఎవరున్నా వదిలిపెట్టకండి. గంజాయిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. గంజాయి విస్తరణ కాలేజీలకు చేరింది.. పోలీసులు వీటిపై నిఘా పెట్టాలి. నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి.

ప్రతీ ఒక్కరికీ బాధ్యత అవసరం..జిల్లాలకు మంత్రులు, ప్రతీ సెగ్మెంట్‌కు స్పెషల్ ఆఫీసర్ నియామకం. గ్రామ సభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యే విధంగా వినిపించాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందించడమే మా లక్ష్యం. మాతో పనిచేయడానికి అధికారులు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సీఎస్‌, డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు. బాధ్యత తీసుకున్న ప్రతీ అధికారి వారి బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాల్సిందే. రోజుకు 18 గంటలు పని చేయండి అని సూచించారు.

- Advertisement -

ఫ్రెండ్లీ ప్రభుత్వమే కానీ..ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎస్‌ఆర్ శంకర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలి. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారులు ప్రజల మనసును గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి. అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులయ్యారు. తెలంగాణ ప్రజల డీఎన్‌ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా మనందరం కలిసి పని చేద్దాం అని సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement